లోకంలో అనేక లోకాలు ఉన్న వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. తాన అంటే తందానా అనేవారు ఉంటారు, తాన అంటే తదరిన అనే వారు ఉంటారు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి వాల్లో తెలుసుకొని మనం వారితో జాగ్రత్తగా మెలగాలి. లేదంటే జీవితమే ఇక్కట్ల పాలు అవుతుంది. సర్వనాశనం అయి అపారమైన దుఃఖం లభిస్తుంది. అలా శిష్యుల తెలివితేటలు తెలీక కాలు విరగ్గొట్టుకున్న గురువు గురించి తెలుసుకుందాం! రండి.
ఒకప్పుడు ఒక గురువు గారు ఉండేవారు. వారికి ఇద్దరు శిష్యులు. ఒకరు చాలా కాలంగా ఆయన్ని సేవిస్తున్నారు. మరొకరు కొత్తగా వచ్చారు. ఒకరోజు, గురువు గారు చాలా దూరం నడిచి వచ్చారు, వారి కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. అప్పుడు ఆయన పాత శిష్యుడిని పిలిచి, "నాయనా! నా కాళ్ళు బాగా నొప్పి పుడుతున్నాయి, నా కాళ్ళు మర్దన చెయ్యి!" అని అడిగారు. కానీ కొత్త శిష్యుడు అడ్డుకున్నాడు. "నేను కూడా గురువు గారికి సేవ చేయాలి కదా! మీరు నన్ను కూడా అనుమతించండి" అని అన్నాడు.
అప్పుడు పాత శిష్యుడు కోపంగా, "నేను చాలా కాలంగా మీకు సేవ చేస్తున్నాను. గురువుగారికి ఎలా చేస్తే సరిపోతుంది అన్నది నాకే బాగా తెలుసు, కాబట్టి నేనే చెయ్యాలి ‘ అన్నాడు. రెండవ శిష్యుడు “ లేదు గురువుగారు! ఇతడు గురువును సేవించిన పుణ్యం అంతా తనకే చెందాలిఅని ఇలా మోసం చేస్తున్నాడు, కాబట్టి నన్ను కూడా అనుగ్రహించి మీ సేవా భాగ్యం నాకు కూడా కలిగించండి” అని అన్నాడు.
వీరి గలాటా బాగా పెద్దది కాసాగింది. ఇరువురి పోట్లాట చూసి గురువుగారికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒకడేమో ఇవ్వనంటాడు, ఇంకోడేమో కుదరదంటాడు. ఇంతలో ఆయనకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది.
శిష్యులను వారించి ఇద్దరినీ దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. “ నాయనలారా! నాకు మీరు ఇరువురూ ప్రియమైన వారే! కనుక ఇరువురూ కూడా సమానంగా సేవ చెయ్యండి. నాకు రెండు కాళ్ళు ఉన్నాయి కదా కాబట్టి ఇద్దరూ సేవ చేసుకునే అవకాశం ఉంది కదా!” అన్నాడు.
ఇద్దరు శిష్యులు ఆనందంగా సేవ చేస్తున్నారు. బాగా అలసిపోయిన గురువుగారు కాస్త కూనుకులోకి జారుకున్నారు. ఇంతలో నిద్రలో ఉన్న గురువుగారి కాలు పొరపాటున మరొక కాలుకి తగిలింది. అవతలివాడు కోపగించి, "ఏమిరా! ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచెయ్యి” అని మందలించి, ప్రతీకారచర్యగా తాను ఒత్తుచున్న గురువుకాలు ఎత్తి అమాంతంగా అవతలిదానిమీద విసిరేశాడు.. మరో శిష్యుడు కూడా రౌద్రాకారం ధరించి, "ఒరే! నాకాలిని కొడుతావా? నీకాలు పనిపట్డుతా చూడు" అని గురువుగారి కమండలాన్ని తీసికొని దానితో అవతలి కాలిమీద బలంగా వేశాడు. ఇంకో శిష్యుడు వెంటనే గురువుగారి యోగదండం తీసికొని ఇవతలికాలిని చావమోదాడు.
గురువుగారికి కాలు విరిగింది బాధతో బిగ్గరగా అరిచి లేవబోయాడు. ఏమిట్రా మీరు చేసినపని అని అరిచాడు. ఇంతలో శిష్యులు గురువుగారు ఇది మా అంతరంగ వ్యవహారం మీరు జోక్యం చేసుకోకండి అని బదులిచ్చారు. కోపగించిన గురువుగారు ఇద్దరినీ అక్కడినుంచి తరిమేశాడు.
లోకంలో అనేక లోకాలు ఉన్న వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. తాన అంటే తందానా అనేవారు ఉంటారు, తాన అంటే తదరిన అనే వారు ఉంటారు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి వాల్లో తెలుసుకొని మనం వారితో జాగ్రత్తగా మెలగాలి. లేదంటే జీవితమే ఇక్కట్ల పాలు అవుతుంది. సర్వనాశనం అయి అపారమైన దుఃఖం లభిస్తుంది. ఇది తెలుసుకున్న మానవుడు మాత్రమే సుఖ సంతోషాలతో జీవితాన్ని సాగిస్తాడు.